: సామాన్యులకు జవాబుదారీగా ఉండటమే సుపరిపాలన: ప్రధాని మోడీ


తీర ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. తీర ప్రాంత రాష్ట్రాల్లో అభివృద్ధి, వాటి మధ్య సమన్వయం ఉండాలన్నారు. రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి విషయంలో తీర ప్రాంత రాష్ట్రాలన్నీ చర్చించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ప్రాంతాల వారీగా వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలని మోడీ అన్నారు. పంటల వారీగా ప్రాంతాలను గుర్తించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సామాన్యులకు జవాబుదారీగా ఉండటమే సుపరిపాలన అని మోడీ చెప్పారు.

అవినీతి రహిత పరిపాలన అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నేరచరిత్ర ఉన్న చట్టసభ సభ్యులపై ఏడాది లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టును కోరతామని ప్రధాని రాజ్యసభ సభ్యులకు చెప్పారు. సచ్ఛీలురు ఎవరో, నేర చరితులెవరో ఏడాది లోగా తేలిపోవాలన్నారు. నేరం చేశారని రుజువైన వాళ్లు జైలుకెళ్లాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. నల్లధనం విషయంలో యూపీఏ ప్రభుత్వం రెండేళ్లుగా మీనమేషాలు లెక్కించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చీ రాగానే నల్లధనంపై చర్యలు తీసుకుందని మోడీ చెప్పారు.

  • Loading...

More Telugu News