: ఎన్నికల వరకు జగన్ జైల్లో ఉంటే వైయస్సార్ సీపీ గెలిచేదేమో!: దాడి వీరభద్రరావు


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు విరుచుకుపడ్డారు. జగన్ ఎన్నికల వరకు జైల్లో వుండి ఉంటే, ఆ పార్టీ గెలిచి ఉండేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జైల్లో ఉన్న జగన్ వేరు, ఇప్పుడు ఉన్న జగన్ వేరు అని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ లో ఉన్న ప్రవృత్తులు బయటకు వచ్చాయని ఆయన అన్నారు.

చివరకు సొంత చెల్లి అయిన షర్మిలకు టిక్కెట్ ఇచ్చేందుకు కూడా జగన్ నిరాకరించారన్నారు. చెల్లిని పక్కన పెట్టి, తల్లిని విశాఖకు తీసుకువచ్చారన్నారు. తల్లిని ఊరు కాని ఊరులో పోటీకి నిలిపిన జగన్ సరిగా ప్రచారం ఎందుకు చేయలేదని దాడి ప్రశ్నించారు. నియంతృత్వం, అహంకారం జగన్ లో మూర్తీభవించిన లక్షణాలని ఆయన అన్నారు. ఎవరితోనూ సంప్రదింపులు జరగకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్లనే పార్టీ ఓటమి పాలైందని ఆయన అన్నారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరిచి వాస్తవాలు గమనిస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వైఎస్సార్సీపీలో చేరడమే తాను చేసిన తప్పు అని ఆయన అన్నారు. తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నానని దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ప్రజలు సమాధిచేశారని ఎద్దేవా చేశారు. వైకాపా కాలగర్భంలో కలసి పోవడం ఖాయమని చెప్పారు.

  • Loading...

More Telugu News