: ఈ దేశంపై మొదటి హక్కు పేదలకే ఉంది: ప్రధాని
తొలిసారి లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల సమస్యలపై అత్యంత వివరంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానంలో భాగంగా పలు విషయాలపై మోడీ ప్రశ్నించారు. ఈ ప్రపంచానికి ఎప్పుడైనా మన నిజమైన శక్తిని తెలియజేశామా? అని సూటిగా సభను ప్రశ్నించిన మోడీ ఇప్పుడు ఎన్నికలు ముగిశాయని... ఇక ప్రపంచానికి మన సత్తా చాటాలనీ అన్నారు. ప్రభుత్వం ఉన్నది విద్యావంతులు, ధనవంతులకేనా? అన్న ఆయన, సంపన్నులు దేశంలో ఎక్కడైనా తమ పిల్లలను చదివించగలరన్నారు. కానీ, పేదలు తమ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లాలని అడిగారు. పేదలు తమ బిడ్డలకి విద్య, వైద్యం కోసం ప్రభుత్వం వైపే చూస్తారన్నారు. కాబట్టి, ఈ దేశంపై మొదటి హక్కు ఎవరికైనా ఉందంటే అది పేదలకేనని స్పష్టం చేశారు.
పేదలకోసం నిలబడకపోతే ప్రజలు మనల్ని ఎన్నడూ క్షమించరన్నారు. పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. ఈ క్రమంలో పేదరికంపై పోరాడే మహత్తర ఆయుధం విద్య అని, అది పేదలకు తప్పకుండా అందించాలనీ అన్నారు. పేదలపై అణచివేతను నిర్మూలించాలని, వారికి విద్యావకాశాలు కల్పించాలని పునరుద్ఘాటించారు.