: ఎనభై శాతం హిందూ ముస్లింలకు మతపిచ్చి ఉంది : కట్జూ
ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో పతాక శీర్షికలకెక్కుతున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి మతంపై దృష్టి పెట్టారు. దేశంలో ఎనభై శాతం హిందువులు, ముస్లింలలో మతపిచ్చి ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మతపిచ్చితో కొట్టుకు చస్తున్న హిందూ ముస్లింలు ఓ శతాబ్దం క్రితం ఐకమత్యంగా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కట్జూ, పొరుగుదేశం పాకిస్తాన్ నూ వదిలిపెట్టలేదు. పాకిస్తాన్ ఓ నకిలీ దేశమని పేర్కొంటూ, అది ఎప్పటికైనా భారత్ లో కలవాల్సిందే అని జోస్యం చెప్పారు. మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదని కట్జూ సెలవిచ్చారు.
మీడియా ధోరణులపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'పాకిస్తాన్ అని పేరుపెట్టి ఓ నకిలీ దేశాన్ని సృష్టించారు. హిందూ ముస్లింలు ఎప్పుడూ కలహించుకునేందుకు బ్రిటిష్ వారు చేసినదే ఈ కృత్రిమ ఏర్పాటు. భారత్ ను ఓ పారిశ్రామిక దేశంగా ఎదగనీయకుండా చేయడమే బ్రిటీష్ వారి ప్రధాన ఉద్ధేశం. 10-20 ఏళ్ళలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భారత్ లో కలవకతప్పదు' అని చెప్పారు.