: దేశం విడిచి వెళ్లరాదని ముషారఫ్ పై పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ అధికారులను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ముషారఫ్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ దాఖలైన న్యాయవాదుల పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, ఈ వ్యవహారంలో రేపు తమ ఎదుట హాజరుకావాలని ముషారఫ్ ను ఆజ్ఞాపించింది. రాజద్రోహానికి పాల్పడినట్లు రుజువైతే ముషారఫ్ కు మరణశిక్ష లేదా జీవితాకాల శిక్ష విధించడం జరుగుతుందని న్యాయవాదులు తెలిపారు.
ఇదిలా వుంటే ఎన్నికల్లో పోటీచేసేందుకు ముషారఫ్ వేసిన నాలుగు నామినేషన్ లలో మూడింటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పాక్ లోని చిత్రాల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాత్రం అంగీకరించారు. మే 11న జరగనున్న పాక్ పార్లమెంటు ఎన్నికలకోసం ముషారఫ్ మార్చి 24న స్వదేశానికి తిరిగి వచ్చారు.
మరోవైపు పార్లమెంటరీ నియెజకవర్గం రావల్పిండి నుంచి పోటీచేసేందుకు పాక్ మాజీ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ వేసిన నామినేషన్ ను ఈసీ తోసిపుచ్చింది. కాగా, పాక్ పీఎమ్ఎల్ ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ నామినేషన్ ను అంగీకరించింది. అభ్యర్ధుల నామినేషన్లు పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ మొత్తం 24,094 మంది ఎన్నికల్లో పొటిచేయనున్నట్లు తెలిపింది.