: సల్మాన్, షారూఖ్ ఇక ఇరుగూపొరుగూ!
సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ లో బడా హీరోలే కాదు.. బద్ధ వైరులు కూడా. పచ్చగడ్డి వేయకుండానే ఇద్దరి మధ్య భగ్గుమంటుంది. గతంలో వీరిద్దరి మధ్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి కూడా. అలాంటిది ఈ ఖాన్ ద్వయం ఇప్పుడు 'ఇరుగుపొరుగు' అవనున్నారు. బాలీవుడ్ లో ఆడంబరాలకు పోయే పలువురు తారలకు భిన్నంగా సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ లోని సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లోనే గత ఇరవై ఏళ్ళుగా ఉంటున్నాడు. సల్మాన్ ఇప్పటికీ తన తల్లిదండ్రులతో కలిసే ఉండడం విశేషం.
తాజాగా ఈ కండలరాయుడు ఓ నూతన నివాసంలోకి మారనున్నట్టు సమాచారం. ఆ ఇల్లు కొంచెం పాతదైనప్పటికీ ఎదురుగా సాగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అంశమే సల్మాన్ ను విశేషంగా ఆకర్షించందట. ముంబయిలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఉండే ఆ భవంతి పేరు 'సాగర్ రేషమ్'. షారూఖ్ ఖాన్ నివాసం 'మన్నత్' కు రెండిళ్ళ ఆవలే సల్మాన్ కొత్త ఇల్లు. ఇంకేం, చిరకాల ప్రత్యర్థులు ఇద్దరూ ఒకే వీధిలో నివాసం ఉండబోతున్నారన్నమాట. ఇంతకీ సల్మాన్ ముచ్చటపడిన 'సాగర్ రేషమ్' విలువెంతో తెలుసా.. రూ. 100 కోట్లండీ బాబూ!!.