: కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయి: చంద్రబాబు
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఐటీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నీటి పారుదల రంగంలో కూడా ఫలితాలు రాకుండా చేశారన్నారు. విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆయన చెప్పారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతబడే పరిస్థితికి తీసుకువచ్చారని ఆయన అన్నారు.
పరిపాలనను గాడిలో పెట్టేందుకు వంద రోజుల ప్రణాళికను రూపొందించినట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రణాళిక, లక్ష్యంతో ముందుకు వెళతామన్నారు. మూడు ఆర్థిక సంఘాలను సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. అయితే అభివృద్ధి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ప్రణాళికలేమిటన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో అభివృద్ధికి మార్గాలు వేస్తామని చంద్రబాబు చెప్పారు.