: రూపాయికే బ్రేక్ ఫాస్ట్... పథకాన్ని ప్రారంభించే యోచనలో జీహెచ్ఎంసీ
ఒక్క రూపాయికే అల్పాహారాన్ని అందించేందుకు జీహచ్ఎంసీ సిద్ధమైంది. ఇప్పటికే ఐదు రూపాయలకు భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు పేదల ఆకలి తీర్చేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పేదవారికి చేదోడుగా నిలవాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. తొలుత పేదవారి కోసం షెల్టర్లను నిర్మించింది. తర్వాత ఐదు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అది సక్సెస్ అయింది. ఇప్పుడీ కొత్త పథకం ద్వారా గ్రేటర్ పరిధిలోని పేదవారికి రూపాయికే టిఫిన్ అందించాలని యోచిస్తోంది.
ఈ పథకంలో మూడు ఇడ్లీలు లేదా ఒక కప్పు ఉప్మా, చట్నీతో అందించాలనే ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది. వాస్తవానికి దీనికి ఐదు రూపాయలు ఖర్చవుతుంది. ఒక రూపాయి లబ్దిదారుల నుంచి సేకరించి, మిగిలిన నాలుగు రూపాయలను జీహెచ్ఎంసీ భరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ ఈ పథకం గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తో చర్చించారు. ఆయన కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.