: హైదరాబాద్-షిర్డీ మార్గంలో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రయాణించే రాష్ట్ర బస్సులకు మహారాష్ట్రలో భద్రత కరవైంది. దోపిడీ దొంగలు ఆంధ్రప్రదేశ్ బస్సులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. దోపిడీకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ తెల్లవారుజామన హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఆర్టీసీ గరుడ బస్సును దోపిడీ దొంగలు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా భూమ్ దగ్గర అడ్డుకున్నారు.
ప్రయాణికులను బెదిరించి నాలుగు బ్యాగులను ఎత్తుకెళ్లారు. దొంగలు అదే మార్గంలో వెళుతున్న మరో బస్సును కూడా దోచుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. వారం క్రితమే ఆంధ్రప్రదేశ్ టూరిజం బస్సును దోచుకునేందుకు మహారాష్ట్రలో దోపిడీ దొంగలు ప్రయత్నించిన సంఘటన మరువక ముందే తాజాగా ఈ ఉదయం మరో ఘటన జరిగింది. అప్పుడు దొంగలు అడ్డగించినా టూరిజం బస్సు డ్రైవర్ ధైర్యంగా ముందుకు పోనీయడంతో ప్రమాదం తప్పింది. అయితే దొంగలు బస్సుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. అయినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వరుస సంఘటనలతో హైదరాబాద్ నుంచి షిర్డీకి బస్సులలో వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.