: సెన్సార్ అంగీకరించని సినిమాల ప్రదర్శన!
పడకగదిలో మితిమీరిన శృంగార పాత్రలు, అసభ్యకరమైన ముద్దు సీన్లు, ఒళ్ళు గగుర్పొడిచే హింసాత్మక సన్నివేశాలు... ఇలా ప్రజలపై చెడు ప్రభావం చూపించే సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెరవేస్తుంది. లేకుంటే విడుదలకు అనుమతి ఇవ్వదు. నాటి నుంచి నేటి వరకూ ఇలా సెన్సార్ కత్తెరకు బలైన సినిమాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఇప్పుడు అలాంటి సినిమాలు.. అసలు సెన్సార్ బోర్డు కత్తిరించకముందున్న రూపాలను త్వరలో ప్రదర్శించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిని భారతీయ సినిమా శత సంబరాదిగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి 30 వరకూ ఢిల్లీలో మసాలా, శృంగార, మతపరమైన, వివాదాస్పద సీన్లున్న సినిమాలను దేశంలోనే తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఈ ఉత్సవాలను సమచార ప్రసార శాఖ నిర్వహిస్తోంది.