: ఔరా...! అనిపించిన ఈ బామ్మను చూసి చాలా నేర్చుకోవాలి...


నడివయస్కులు నాలుగడుగులు వేస్తే చాలు ఆయాసం, గుండెదడ. యువతరం శారీరక శ్రమను వదిలేసి చాలా కాలమైంది. వారిని నడవడమంటేనే చిరాకుపడిపోతారు, మరి పరుగెత్తమంటే అమ్మో ఇంకేం చేస్తారో... అందుకే ఊబకాయం సమస్య రోజురోజుకి పెరిగిపోతోంది. అదలా ఉంచితే, ఓ బామ్మ 91 ఏళ్ల వయసులో 42 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది అంటే నమ్మగలమా? నమ్మాలి.

హారియట్ థాంప్సన్ (91) తన స్నేహితురాలికి చెందిన లుకేమియా లింఫోమియా ఫౌండేషన్ కు నిధుల సేకరణ నిమిత్తం 42 కిలోమీటర్ల మారథాన్ లో పాల్గొని పూర్తి చేసి, 90 వేల డాలర్లు సేకరించి శభాష్ అనిపించింది. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన ఈ మారథాన్ లో ఉదయం 6:30 నిమిషాలకు పరుగు ప్రారంభించిన హారియట్ ఏడు గంటల ఏడు నిమిషాల 42 సెకెండ్ల పాటు నిర్విరామంగా పరుగెత్తి రికార్డు సృష్టించింది.

గతంలో గ్లేడీస్ బరిల్ (92) అనే మహిళ 9 గంటల 53 నిమిషాల్లో పరుగెత్తి రికార్డు సృష్టించింది. హారియట్ క్యాన్సర్ పేషంట్. మారథాన్ కు నాలుగు వారాల ముందు, 11 రోజులపాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దీంతో రెండు కాళ్లకి విపరీతమైన గాయాలయ్యాయి. అయినప్పటికీ కాళ్లకు బ్యాండేజ్ లు కట్టుకుని ఆమె మారథాన్ పూర్తి చేయడం విశేషం. 21 కిలోమీటర్ల తరువాత పరుగు చాలా కష్టంగా అనిపించిందని, బ్యాండ్లమీద దృష్టి పెట్టి పరుగు ఎలాగోలా పూర్తి చేశానని బామ్మ చెబుతోంది.

మారథాన్ అనంతరం ఆమెను చుట్టుముట్టిన మీడియాతో చల్లని నీటితో స్నానం చేసి నిద్రపోవాలనిపిస్తోందని తెలిపింది. పట్టుదల ఉంటే దేన్నయినా సాధించొచ్చని బామ్మ నిరూపించింది. ఈమెను చూసి యువత చాలా నేర్చుకోవాలని అమెరికా మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది.

  • Loading...

More Telugu News