: అమితాబ్, షారూఖ్ ని నాగార్జున మరిపిస్తాడా?


బుల్లితెరపై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఇప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'గా తెలుగులో సందడి చేయనుంది. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ హిందీలో 'కౌన్ బనేగా కరోడ్ పతి'కి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. కాగా, తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' క్విజ్ షోను స్టార్ హీరో నాగార్జున ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నారు.

మానవ సంబంధాలు, సమాజ శ్రేయస్సు, మేధో సంపత్తికి ప్రోత్సాహం వంటి అంశాలన్నీ కలగలసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణ. ప్రోమోలతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' జూన్ 9 నుంచి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు మా టీవీలో ప్రసారం కానుంది.

క్విజ్ మాస్టర్ సిద్ధార్థ బసు నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ టీవీ షో ప్రసారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు ఈ షో కోసం ఎంట్రీలు ఆహ్వానించారు. లక్షలాది మంది అభిమానులు ఎస్ఎమ్ఎస్ లు పంపి ఎంట్రీలు ఖరారు చేసుకున్నారు. వారిలో 1500 మందిని 'థర్డ్ పార్టీ ఏజెన్సీ' ద్వారా ఎలాంటి అవకతవకలకు తావు లేని విధంగా సెలెక్ట్ చేశారు.

వారిలో 100 మందిని హైదరాబాదు, విజయవాడ, తిరుపతిలో ఆడిషన్స్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. వారిలో హాట్ సీట్ కు చేరుకున్న మొదటి తొమ్మిది మందితో తొలి దశ షూటింగ్ పూర్తి చేశారు. ఆరు ఎపిసోడ్లు చిత్రీకరించారు. నాగార్జున నిర్వహించిన క్విజ్ షో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో నియమ నిబంధనలన్నీ 'కౌన్ బనేగా కరోడ్ పతి'లోనివే కావడం విశేషం.

  • Loading...

More Telugu News