: లేడీ కండక్టర్ ను వివస్త్రను చేసి... కొట్టిన ప్రయాణికుడు!
తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్ అరాచకాలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని (ముంబై) లో పట్టపగలు, నడి రోడ్డు మీద, అందరూ చూస్తుండగా దారుణం చోటు చేసుకుంది. థానే జిల్లా పరిధిలోని కల్యాణ్-పన్వేల్ మధ్య తిరిగే బస్సులో ప్రయాణిస్తున్న అభిషేక్ సింగ్ (30) కు, డ్రైవర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ (34) అతనిని బస్సుదిగాల్సిందిగా ఆదేశించింది.
దీంతో ఆగ్రహించిన అభిషేక్ కండక్టర్ కాళ్లు పట్టి బస్సులోంచి లాగిపడేశాడు. రోడ్డుమీద పడిపోయిన ఆమెను దుస్తులు చించి కొట్టడం మొదలుపెట్టాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడం విశేషం. వెనుక బస్సు మహిళా కండక్టర్ అతనిని ఆపేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశాడు. దీంతో బస్సులోని కొంతమంది విద్యార్థులు వచ్చి అభిషేక్ ను నిలువరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.