: అతడి మొబైల్ బిల్లు 13 కోట్లు..!
అతడి మొబైల్ ఫోన్ కు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. అది చదవగానే షాక్ తగిలినట్లుగా అనిపించింది. ఇంతకీ అందులో ఏముందంటే.. "జనవరి నెలకు మీ మొబైల్ బిల్లు 13,18,47,813 రూపాయలు(అంటే 13కోట్లకు పైమాటే). వెంటనే చెల్లించి కనెక్షన్ కట్ కాకుండా చూసుకోండి"... ఇదీ అందులోని సారాంశం.
ఇది చదివిన తర్వాత ముంబయి వాసి విశ్వనాథ్ శెట్టికి మతిపోయింది. అతడికి నెలనెలా 1000 రూపాయలకు కాస్త అటూ ఇటూగా బిల్ వస్తోంది. ఒక్కసారిగా కోట్ల రూపాయలు అనే సరికి వెంటనే ఎంటీఎన్ఎల్ అధికారుల దగ్గరకు పరుగు తీశాడు. 'ఏమిటీ బిల్లు?' అని ప్రశ్నించాడు. వారు విశ్వనాథ్ ని శాంతింపజేశారు. ఫిర్యాదు తీసుకుని సరి చేస్తామన్నారు. ఆందోళనగా ఇంటికి వెళ్ళిన విశ్వనాథ్ కు గంట తర్వాత గురువారం రాత్రి మరో ఎస్ఎంఎస్ వచ్చింది.
"మన్నించండి. ఇందాక వచ్చిన ఎస్ఎంఎస్ ను మరిచిపొండి. మీ జనవరి నెల బిల్లు 1,318 రూపాయలు మాత్రమే" అని రావడంతో విశ్వనాథ్ ఊపిరి లేచి వచ్చింది. అంటే, ఎంటీఎన్ఎల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 13 వందలు కాస్తా 13 కోట్లకు వెళ్ళిపోయింది.