: మీ కాలుకు ముల్లు దిగితే...నా పంటితో పీకేస్తా: కేసీఆర్
గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలుకి ముల్లు దిగితే పంటితో పీకేస్తానని కేసీఆర్ చెప్పారు. గజ్వేల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ ప్రజలు తనపై అమృతం కురిపించారని అన్నారు. గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పిన కేసీఆర్, రెండు లక్షల ఎకారాలకు గోదావరి నుంచి సాగునీరు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.
తన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. అందుకే ముందుగా మూడు వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. అందులో 50 వేల కోట్ల రూపాయలు దళితుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వ రెండవ ప్రాధాన్యత వ్యవసాయ రంగానికని తెలిపారు. కూరగాయలు పండించేందుకు అనువైన నేలలున్న గజ్వేల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నిపుణులతో గ్రీన్ ఫామింగ్ కల్చర్ తీసుకువస్తామని ఆయన చెప్పారు. అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేసి, కేవలం విత్తనాలు మాత్రమే పండించి, తెలంగాణ రైతులను లక్షాధికారులను చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందన్న ఆయన, వివిధ రంగాల ప్రతినిధులతో అడ్వయిజరీ కమిటీ వేస్తామన్నారు. అందులో పత్రికాధిపతులు, న్యాయకోవిదులు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయల రైతు రుణాలు ఉన్నాయని, వాటిని 10 లేక 12 రోజుల్లో మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆటో కార్మికులకు రవాణా పన్ను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు అందజేస్తామన్నారు. అద్భుతమైన తెలంగాణ సమాజ నిర్మాణం తన కల అని, అందరూ ఉత్తమ విద్య అందుకుంటే తన కల సాకారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కల సాకారమవ్వడానికి ఒకట్రెండేళ్లు పడతాయని తెలిపారు.
నిర్బంధ ఉచిత విద్య అందించేందుకు రానున్న ఒకట్రెండు సంవత్సరాల్లో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేసి ప్రతి తెలంగాణ విద్యార్థిని ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు.