: పాప్ స్టార్ భ్రమపడింది... నోటికి పని చెప్పింది!
పాప్ గాయని మడోన్నా తనది కాని కారును తనదని భ్రమపడింది. కారునే కాదండోయ్, కారు డ్రైవర్ కూడా తన వాడు కాదని గుర్తించకుండా గయ్యిమని అరిచేసింది. లాస్ ఏంజెలెస్ లో ఓ స్టూడియోకు వెళ్లిన మడోన్నా పని పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. రోడ్డు మీదున్న కారు దగ్గరకు వెళ్లి 'ఏయ్ ఏం చేస్తున్నావు? నేనెక్కడున్నానో చూసుకోవాల్సిన అవసరం లేదా?' అంటూ మండిపడింది. బిత్తరపోయి చూస్తున్న అతడితో 'ఏమైంది? ఏంటా చూపు?' అంటూ, 'నన్ను స్టూడియో దగ్గర పికప్ చేసుకోవాలని తెలియదా?' అంటూ నిలదీసింది.
దీంతో తేరుకున్న సదరు డ్రైవర్ 'మేడమ్ మీరు పొరపాటుపడినట్టున్నారు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో?' అని, 'నేను మీ డ్రైవర్ ను కాదు, ఈ కారు కూడా మీది కాదు' అని తెలిపాడు. దీంతో నాలుక్కరుచుకుని, తన డ్రైవర్ ను గుర్తించిన మడోనా, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయింది.