: ప్రధానికి రాసిన లేఖలో సోనియా 43 అంశాలను ప్రస్తావించారు: చిరంజీవి
ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సోనియా గాంధీ 43 అంశాలను ప్రస్తావించారని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆ 43 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో, రాజ్యసభలో ప్రధాని ప్రస్తావించినవేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరిచిన అంశాలను తక్షణం అమలు చేయాలని ప్రతిపక్ష నేత హోదాలో సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో, పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సోనియా గాంధీకి సూచించామని చిరంజీవి తెలిపారు. దానిపై ఆమె సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగకుండా కాంగ్రెస్ పార్టీ 'వాచ్ డాగ్' పాత్ర పోషిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.