: రైతులకు రూ.లక్ష రుణ మాఫీ హామీని నిలబెట్టుకుంటా: కేసీఆర్
రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలి ప్రసంగం చేస్తూ, తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని అన్నారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను తెలంగాణ సమాజం మరిచిపోదని అన్నారు. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయల ఫించన్ ఇస్తామని, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ చెల్లిస్తామని ఆయన చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లును నిర్మించి ఇస్తామని ఆయన ప్రకటించారు. బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని ఆయన అన్నారు. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని కేసీఆర్ అన్నారు.