: రెండు రాష్ట్రాల అభివృద్ధికి తానా నిధుల సేకరణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి నిధుల సేకరణ ప్రారంభించినట్లు అధ్యక్షుడు నన్నపనేని మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిధి, తెలంగాణ అభివృద్ధి నిధి పేరిట నిధులను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. తమకు నచ్చిన ఏదైనా ప్రాంతానికి లేదా ఇరు ప్రాంతాలకు చెందేలా తమ విరాళాలను వినియోగించాలని కోరుకునే వెసులుబాటును దాతలకు కల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ విరాళాలకు అమెరికాలో పన్ను మినహాయింపు కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. తానా డైరెక్టర్ల బోర్డు సభ్యుడు జయరాం, తానా కార్యదర్శి వేమన సతీష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసి ఈ నిధులు సద్వినియోగమయ్యేలా చూస్తారని మోహన్ చెప్పారు.