: ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు: వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే... దాన్ని సరిదిద్దేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోస్టుల ఖాళీలపై రెండు ప్రభుత్వాలు చూసుకుంటాయని వెంకయ్య చెప్పారు. తెలుగు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి చర్చిస్తే బాగుంటుందని అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో కేంద్ర పథకాల అమలు తీరు ఎలా ఉందో వివరాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. యూఐజీ కింద ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 54 ప్రాజెక్టుల్లో 24 పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో మరింత అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.