: బాలీవుడ్ లోనే కాదు.. ఎక్కడైనా అంతే!
అసలు సినీ పరిశ్రమ తీరే ఇంతేనేమో! అది హాలీవుడ్ అవనివ్వండి.. బాలీవుడ్, టాలీవుడ్ తీసుకోండి.. ఎక్కడైనా ఈ తంతు మారదు! ముసలి హీరోలు సైతం పడుచు హీరోయిన్లే కావాలంటారు. హాలీవుడ్ లో జార్జి క్లూనీ, బ్రూస్ విల్లీస్ వంటి వారు తమ వయస్సులో సగం ఈడున్న నాయికలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన వాళ్ళే.
బాలీవుడ్ లోనూ అంతే. సూపర్ స్టార్లు అందరూ నలభై ఏళ్ళ మార్కు ఎప్పుడో దాటేశారు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్.. ఇలా అందరూ 50కి దరిదాపుల్లో ఉన్నారు. వీళ్ళ సినిమాల్లో నటించే హీరోయిన్లను మాత్రం 20 ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. దీపికా పదుకొనే, అసీన్, సోనాక్షి సిన్హా వంటి హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఇదేనని బి-టౌన్ టాక్. 2007 లో విడుదలైన నిశ్శబ్ద్ లో అమితాబ్ తనకన్నా 46 ఏళ్ళ చిన్నదైన జియాఖాన్ తో ప్రేమ సన్నివేశాల్లో జీవించగా.. 2010లో బాక్సాఫీసును షేక్ చేసిన దబాంగ్ లో సల్లూ భాయ్ తనకన్నా 20 ఏళ్ళ చిన్నదైన సోనాక్షితో నటించడం ఇందుకు ఉదాహరణలు.
ఇక టాలీవుడ్ విషయానికొస్తే, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలు యాభై దాటేశారు. వారి సరసన స్టెప్పులేయాల్సింది మాత్రం నయనతార, అనుష్క, ఇలియానా, కాజల్ వంటి కుర్ర హీరోయిన్లే. దీనికంతటికీ కారణం, ప్రేక్షకులేనని నిర్మాతలంటున్నారు. ముదురు హీరోల సరసన, ఏజ్ బార్ హీరోయిన్లను వారు అంగీకరించడం లేదని.. సెంటిమెంట్ ను ధిక్కరించి సినిమా తీసి చేతులు కాల్చుకోవడం ఎందుకని ప్రొడ్యూసర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.