: హమ్మయ్య.. బోణీ చేశాం.. సంతోషం: డేల్ స్టెయిన్
ఐపీఎల్ గత అంచె పోటీల్లో 2009 సీజన్ మినహాయిస్తే.. ఆ 'జట్టు' ఆడుతుందంటే ఎవరికీ ప్రత్యర్థి జట్టు విజయంపై సందేహాలుండేవి కావు! వైరి పక్షం ఎంత బలహీనమైనదైనా, సదరు 'జట్టు' ఎంత తేడాతో ఓడిపోతుందన్నదే ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది. ఐపీఎల్ లో అంతటి ఘనత వహించిన 'జట్టు' డెక్కన్ ఛార్జర్స్ అని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే, ఆ పరాజయ పరంపర గత సీజన్లకే పరిమితమని నిరూపించే ప్రయత్నంలో 'సన్ రైజర్స్ హైదరాబాద్' తొలి అడుగు దిగ్విజయంగా వేసింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 22 పరుగుల తేడాతో పుణే వారియర్స్ ను చిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పుణే జట్టు 104 పరుగులకే చతికిలపడింది.
తమ విజయం పట్ల సన్ రైజర్స్ ప్రధాన బౌలర్ డేల్ స్టెయిన్ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ, జట్టుగా సమష్టి ఆటతీరు కనబర్చామని తెలిపాడు. 126 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకోవడం ఎంతో శ్రమతో కూడిన వ్యవహారమని చెబుతూ, అయినా పోరాడామని పేర్కొన్నాడు. కాగా, చార్జర్స్ యాజమాన్యం ఆర్ధిక ఇబ్బందులతో హైదరాబాద్ ఫ్రాంచైజీని కోల్పోయిన తర్వాత సన్ టీవీ దాన్ని కైవసం చేసుకుంది. ఫ్రాంచైజీ పేరును సన్ రైజర్స్ హైదరాబాద్ గా మార్చిన సంగతి తెలిసిందే.