: పోలవరంపై అన్ని నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది: వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్మించి ఆంధ్రప్రదేశ్ కు అందజేస్తామని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని... ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సంబరాలు చేసుకున్నప్పుడే అందులోని అన్ని షరతులకు ఒప్పుకున్నట్టు అయిందని ఆయన గుర్తు చేశారు.
ఆర్డినెన్స్ పై రాద్దాంతం చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన తెలిపారు. పోలవరం నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అందులో వచ్చే ఇబ్బందులను పరిష్కరించాల్సిన భాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఆయన స్పష్టం చేశారు.