: ఏడంతస్తులు నేలమట్టం.. 72మందికి పైగా సజీవసమాధి
నిన్నటివరకూ దర్పం ఒలకబోసిన ఏడంతస్తుల భవంతి.. నేడు నేలమట్టం అయింది. అభంశుభం తెలియని 19 మంది చిన్నారులు సహా 72 మందిని పొట్టనబెట్టుకుంది. 70మందికి పైగా తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేస్తూ ఆసుపత్రుల బాటపట్టేలా జేసింది. ఈ వినాశనానికి మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఏడంతస్తుల భవనమే కారణం.
కాగా, కూలిపోయిన ఈ భవానికి ఎలాంటి అనుమతులూ లేకున్నా, కేవలం రెండునెలల్లోనే హడివుడిగా నిర్మాణం పూర్తి చేశారని సమాచారం. భవన నిర్మాణంలో నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ అధికారులు ప్రాధమికంగా నిర్థారించారు. సదరు భవన కాంట్రాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగి సుమారు 36 గంటలైనా ఆ ప్రాంతంలో ఇంకా ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంచెంసేపటి క్రితమే శిధిలాలలో చిక్కుకుని నరకయాతన అనుభవించిన ఓ మహిళను వెలికితీశారు. శిధిలాల క్రింద ఇంకా చాలామంది ఉండవచ్చని భావిస్తున్నారు. జాతీయ విపత్తు స్పందన దళం, పలు ప్రభుత్వ, స్వచ్చంద సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.