: విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని: మోదుగుల
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ? అన్న సందేహాన్ని పటాపంచలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓ విషయాన్ని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యే రాజధానిని ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు సీఎంగా గుంటూరులో ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం అదేనన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సీమాంధ్రలోని విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది.
ఏ ఏ ప్రాంతాలకు ఏఏ అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయో తెలుపుతూ కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. అనంతరం కేంద్రం నూతన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన ప్రభుత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజధానిని నిర్ణయిస్తుంది. అందులోనూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉన్నందున ఈ పార్టీ నిర్ణయం కీలకం కానుంది. మొత్తానికి మోదుగుల చెప్పినదాన్ని బట్టి చూస్తే రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యే రానున్నట్లు తెలుస్తోంది.