: పాదయాత్రలో తన అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ‘మీ కోసం’ పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను చంద్రబాబు మహానాడులో గుర్తు చేసుకున్నారు. పాదయాత్ర చేస్తుండగా ఓరోజు పూరిగుడిసెలో ఓ వృద్ధురాలు జ్వరంతో బాధపడుతూ ఉందని, తాను వెళ్లి ఆమెను పలుకరించినప్పుడు మనసుకు బాధ కలిగించిందని అన్నారు. ఆసుపత్రికి పోలేదా? అని అడిగితే, తనకు కొడుకులెవరూ లేరని, తననెవరు ఆసుపత్రికి తీసుకుపోతారని అడిగినట్లు ఆయన చెప్పారు. అలాంటి వారి కోసం ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని చూసి ఆనాడు బాధపడ్డానన్నారు.
పాదయాత్రలో ఉండగా ఓసారి గుడి దగ్గర ఇద్దరు అనాథలు ఉన్నారని, వాళ్లలో ఒకావిడ నడవలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. తాను వెళ్లి కలిసినప్పుడు సహాయం చేయమని అడిగితే మనసు చివుక్కుమన్నదని చంద్రబాబు చెప్పారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని అప్పుడే అనుకున్నానని ఆయన అన్నారు. రాత్రి ఒంటి గంట వరకూ రైతులు పొలంలో చలిమంట వేసుకుని కూర్చుని కరెంటు కోసం ఎదురు చూసిన సందర్భాలున్నాయని అన్నారు. కరెంటు కోతలతో విద్యార్థులు చదువుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు.