: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి ఉరేశారు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగిపోయింది. యుక్తవయసులో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లను సామూహిక అత్యాచారం చేసి, ఇద్దర్నీ చెట్టుకు ఉరివేసి చంపేశారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన బదాన్ ప్రాంతంలోని కట్రా గ్రామంలో జరిగింది. గత రాత్రి అక్కాచెల్లెళ్లను దుండగులు అపహరించారు. వారిని సామూహిక అత్యాచారం చేసిన అనంతరం చెట్టుకి ఉరేశారు. ఈ ఉదయం వారిద్దరూ చెట్టుకి వేలాడడం చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
విషయం తెలియడంతో బాలిక బంధువులు, గ్రామస్థులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతో గ్రామస్థులు వారిని అడ్డుకుని, మృతదేహాలతో ఉషాఈట్-లిలావన్ రహదారిపై ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు.
అఖిలేష్ యాదవ్ న్యాయం చేసే వరకు కదిలేది లేదని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తో పాటు, మరో నలుగురు వ్యక్తుల ప్రమేయం వుందని బాలికల బంధువులు తెలిపారు.