: అభిమానుల అభిమానం తట్టుకోలేపోయిన నమిత


సినీ నటులంటే అభిమానులకు ఎక్కడలేని అభిమానం ముంచుకొస్తుంది. అదే తమిళనాటయితే ఆ అభిమానం హద్దులు దాటుతుంది. సినీ నటులకు గుళ్లు కట్టిన అభిమానం తమిళులది. తమ అభిమాన తార వస్తున్నారంటే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటి చోట అభిమానుల హడావుడికి అంతం ఉండదు. తమిళనాట అశేష అభిమానజనాన్ని సంపాదించుకున్న సినీ నటి నమిత అభిమానుల ఆదరణను తట్టుకోలేకపోయారు. తమిళనాడులోని నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి అనే గ్రామంలో భగవతి ఆలయంలో ఉత్సవాలు జరిగాయి.

నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణవాళ్కై అనే నాటిక ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీనిని ప్రారంభించేందుకు నటి నమిత, దర్శక నటుడు కె. భాగ్యరాజ్ అతిథులుగా హాజరయ్యారు. దీనిని ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. నాటకం ప్రారంభించేందుకు నమిత స్టేజ్ మీదకి చేరుకోవడంతో అభిమానులంతా బారికేడ్లను తోసుకుని స్టేజ్ దగ్గరకు వచ్చేశారు. వారి తోపులాటకు స్టేజ్ ఒకవైపుకి ఒరిగిపోయింది. నిర్వాహకులు నమితను జాగ్రత్తగా అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు.

నమిత పడిపోయిందని ప్రచారం జరగడంతో నామక్కల్ ప్రభుత్వాసుపత్రిలో ఉండే మూడు అంబులెన్సులు భగవతి ఆలయం వద్దకు చేరుకుని నమితను ఆసుపత్రి తీసుకెళ్లేందుకు పోటీ పడ్డాయి. తనకెలాంటి గాయాలు కాలేదని నమిత చెప్పడంతో అంబులెన్సులు వెనుదిరిగాయి. తరువాత వేరే స్టేజ్ ఏర్పాటు చేసి నాటకం ప్రారంభించమని నమితను నిర్వహకులు కోరినా, ఆమె నిరాకరించారు. దీంతో నాటకాన్ని భాగ్యరాజ్ ప్రారంభించారు. అనంతరం నమిత భాగ్యరాజ్ కారులో చెన్నై చేరుకున్నారు.

  • Loading...

More Telugu News