: సంజయ్ దత్ కు శిక్ష మాఫీచేయాలంటూ 60 దరఖాస్తులు
మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రం ద్వారా ఎంతో మంది మోములో చిరునవ్వులు పూయించాడు సంజయ్ దత్. అలాంటి సంజయ్ సుప్రీం కోర్టు విధించిన జైలు శిక్ష కారణంగా తీవ్ర విచారంలోకి వెళ్లిపోయాడు. మీడియా ముఖంగానే బాధను ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని చూసే ఉంటారు. సంజయ్ బాధ ఎంతో మందిని కదిలించింది. అభిమాన నటుడికి శిక్షను మాఫీ చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్ కు ఎంతో మంది అభ్యర్థనలు పంపారు. సంజయ్ దత్ కు శిక్షను మాఫీ చేయండంటూ 60 దరఖాస్తులు వచ్చాయని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
వీటిపై స్పందన తెలియజేయాలని ఆ దరఖాస్తులను గవర్నర్ శంకర్ నారాయణ్ మహారాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి పంపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ, సామాజిక ఉద్యమకర్త అభాసింగ్, జయప్రద, పలు స్వచ్ఛంద సంస్థలు సంజయ్ దత్ క్షమాభిక్ష కోసం అభ్యర్థించాయి.వాస్తవానికి తాను శిక్షను మాఫీ చేయమని కోరనని, కోర్టు తీర్పును గౌరవించి శిక్ష అనుభవిస్తానని సంజయ్ దత్ బాధతో కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి విదితమే. మరి తాజాగా ఇతరుల నుంచి వచ్చిన ఈ అభ్యర్థనలను పరిశీలించి తర్వాత మహారాష్ట్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంజయ్ దత్ కు కారాగార వాసం నుంచి విముక్తి లభించినట్లే.