: ఐపీఎల్ లో నేటినుంచి రెండు మ్యాచ్ ల వినోదం
ఐపీఎల్ ఆరవ సీజన్ నేటి నుంచి మరింత రసవత్తరంగా సాగబోతుంది. నిన్నటివరకు రోజుకు ఒక్క మ్యాచ్ వినోదాన్నే ఆస్వాదించిన క్రికెట్ అభిమానులు ఈరోజు నుంచి రోజుకు రెండు మ్యాచ్ లను ఎంజాయ్ చేయబోతున్నారు. ముందు సాయంత్రం 4 గంటల నుంచి ఢిల్లీ వేదికగా ఢిల్లీ 'డేర్ డెవిల్స్-రాజస్థాన్ రాయల్స్' తలపడబోతున్నాయి. అనంతరం 8 గంటల నుంచి చెన్నై వేదికగా 'చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్' జట్లు తలపడనున్నాయి. ఈ మూడురోజులు మూడు గంటల మజానే చూసిన ప్రేక్షకులకు ఇకనుంచి డబుల్ ధమాకా అన్న మాట.
మరోవైపు నిన్న రాత్రి హైదరాబాద్ సన్ రైజర్స్, పుణె వారియర్స్ మ్యాచ్ లో సన్ రైజర్స్ బోణీకొట్టింది. ముందుగా టాస్ గెలిచిన పుణె ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ జట్టును 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్ ను దక్కించుకుంది. కేవలం సాధారణ బ్యాటింగ్ తో మ్యాచ్ ను గెలిచిన రైజర్స్ బౌలింగుతోనే పుణేను కట్టడి చేసిందని చెప్పోచ్చు.
అమిత్ మిశ్రా 3 వికెట్లు తీసి పుణె పెవిలియన్ బాట పట్టించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు. మరో బౌలర్ తిషార పెరీరా (2/29) ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అటు పుణె ఎంత కష్టపడినా హైదరాబాద్ బౌలింగ్ లో చుక్కలు చూపించడంతో తలవంచాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పరుగులు పిండుకుని అతికష్టంతో 104 పరుగులు మాత్రం చేసింది.