: టీడీపీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి


తెలుగుదేశం పార్టీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని గండిపేట తెలుగువిజయం, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ రోజు, రేపు మహానాడు జరగనుంది. ఈ రోజు మహానాడు కార్యక్రమాలు ఈ విధంగా జరగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధుల నమోదుతో మహానాడు కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. అనంతరం 10.30 గంటలకు ఫోటోఎగ్జిబిషన్ ను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు ప్రముఖులు సభావేదికపై ఆసీనులవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహానాడుకే రానున్నారు.

ఇక 11.10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి 'మా తెలుగుతల్లి ' గీతాలాపన చేస్తారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పూలమాలతో అలంకరిస్తారు. 11.25 గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించిన అనంతరం జమా ఖర్చుల నివేదికను వెల్లడిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. ఒంటి గంటకు భోజన విరామసమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 2 గంటల నుంచి తీర్మానాలపై చర్చ జరుగుతుంది. టీడీపీ జాతీయపార్టీగా అవతరించనున్న నేపథ్యంలో ఈ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. కాగా ఈ మహానాడుకు 25వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News