: మంచి ఆరోగ్యానికి... ఉప్పు చేటు .. పొటాషియం మేలు
మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గించుకోవాలంటే.. పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉప్పును కూడా బాగా తగ్గించాలంటున్నాయి.
కేవలం నాలుగువారాలు ఉప్పు వాడకం తగ్గించినా కూడా.. రక్తపోటు తగ్గుతోందని... పొటాషియం ఎక్కువ తీసుకోవడం ఇంకా మంచిదని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు` పొటాషియం మన ఆరోగ్యంపై విరుద్ధమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఉప్పు వినియోగంతో ప్రమాదాలు పెరుగుతుండగా, పొటాషియం రక్తపోటు తగ్గిస్తోందిట. దీనివల్ల 23 శాతం పక్షవాతం ప్రమాదం కూడా తగ్గుతుందిట.
ఈ పొటాషియం ఎక్కడ దొరుకుతుందా అనుకుంటున్నాం కదా.. తాజా పండ్లు, కూరగాయలు, పప్పుల్లో ఎక్కువగా దొరుకుతుంది. ప్రతిమనిషీ రోజుకు ఒక చెంచా మించకుండా ఉప్పు తీసుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 2025 నాటికి ప్రపంచానికంతా ఈ అవగాహన కల్పించాలని ఉద్యమిస్తోంది కూడా. ప్రస్తుతం చాలా దేశాల్లో.. మనం కూడా.. ఇంతకంటె ఎక్కువే తీసుకుంటున్నాం.