: మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు...ఆ నాలుగు బంతులు ఒక ఎత్తు...చరిత్ర చూడని వింత!


ఐపీఎల్ సీజన్ 7లో అభిమానుల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్! ఈ మ్యాచ్ లో చివరి నాలుగు బంతులు తీవ్ర ఉత్కంఠ రేపాయి. మ్యాచ్ మొత్తం ఒక ఎత్తయితే ఆ నాలుగు బంతులు ఒక ఎత్తు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సందర్భాన్ని ఎవరూ చూసి ఉండరు. 3 బంతుల్లో 9 పరుగులు చేస్తే ముంబై ప్లేఆఫ్ కు చేరుతుంది. అప్పుడు ఫాల్కనర్ బంతిని అందుకున్నాడు. స్ట్రైకింగ్ లో చెలరేగి ఆడుతున్న కోరె ఆండర్సన్ ఉన్నాడు. దీంతో ముంబై జట్టు ధీమాగా ఉంది.

తొలి బంతిని ఫాల్కనర్ యార్కర్ వేశాడు. ఆండర్సన్ బాదాడు. బంతి నేరుగా ఫీలర్డ్ చేతుల్లో పడింది. దీంతో ఒక్క పరుగే వచ్చింది. ఇక మిగిలినవి రెండు బంతులు... కొట్టాల్సినవి 8 పరుగులు... క్రీజులో రాయుడు. దీంతో రాజస్థాన్ లోలోపల ఆనందం. ఫాల్కనర్ బంతిని లెగ్ వికెట్ వైపుగా ఫుల్ టాస్ విసిరాడు. అంతే, రాయుడు బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. అంతే, ముంబై జట్టులో ఆనందం, రాజస్థాన్ జట్టులో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ. మిగిలింది ఒక బంతి... చేయాల్సినవి రెండు పరుగులు.

ఫాల్కనర్ వేసిన బంతిని అంచనా వేయడంలో బోల్తా కొట్టిన రాయుడు పెద్ద షాట్ ఆడలేకపోయాడు. దీంతో బంతి కవర్స్ దాటలేదు. ఒక పరుగు పూర్తైంది. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా రాయుడు రనౌట్ అయ్యాడు. అంతే రాజస్థాన్ జట్టు డగౌట్ సంబరాల్లో మునిగిపోయారు. ప్లే ఆఫ్ బెర్తుకు చేరుకున్నామనుకున్నారు. ఇంతలో స్కోరు బోర్డుపై రెండు జట్లలో ఏ జట్టూ ప్లే ఆఫ్ కు చేరలేదని, కారణం పాయింట్లతో పాటు, నెట్ రన్ రేట్ కూడా సమానమైందని థర్డ్ అంపైర్ తెలిపారు.

దీంతో రన్ రేట్ మెరుగ్గా ఉండాలంటే తరువాత వేసే బంతిని ఫోర్ లేక సిక్స్ కొడితేనే ముంబై ప్లేఆఫ్ కు చేరుతుందని అంపైర్ స్పష్టం చేశాడు. దీంతో అదనంగా వేస్తున్న ఆ బంతిపై ఉత్కంఠ తార స్థాయికి చేరింది. స్టేడియంలో అభిమానులు తమ అభిమాన జట్టే గెలవాలని ప్రార్థించని దేవుడులేడంటే అతిశయోక్తి కాదు. ఇంతలో తారే క్రీజులోకి వచ్చాడు. ఫాల్కనర్ బంతిని రాయుడికి వేసినట్టే లెగ్ మీదుగా ఫ్లైటెడ్ డెలివరీగా టాస్ వేశాడు.

తారే కూడా రాయుడిలానే స్క్వేర్ లెగ్ వైపు సిక్సర్ బాదేశాడు. అంతే, వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. నీతా అంబానీ, అకాష్ అంబానీ, సచిన్, కుంబ్లే స్టేడియంలోకి దూసుకొచ్చి, తారే, ఆండర్సన్, రాయుడులను అభినందనల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News