: ఐఆర్ఎస్... ముఖ్యమంత్రి... ఖైదీ నెంబర్ 3642... కేజ్రీవాల్ కథ ఇది
ఓడలు బళ్లు...బళ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో... అఖిల భారత సర్వీసు అధికారిగా విధులు నిర్వర్తించిన ఆయన, సమాజాన్ని మార్చాలన్న సంకల్పంతో పోరాటయోధుడిగా మారారు. ఉద్యమాల్ని నడిపించిన ఆయన, ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగుపెట్టి, పార్టీని స్థాపించారు. తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ఎవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఆయన నెంబర్ 3642. చాలా తక్కువ వ్యవధిలో ఉథానపతనాలు చవిచూసిన కేజ్రీవాల్ నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో రిమాండ్ ను అనుభవిస్తున్నారు.