: ఆఫ్రికాలో పుట్టిన ఒబామా అమెరికా ప్రెసిడెంటయ్యాడు: కేసీఆర్ కు బాబు హితవు
ప్రపంచం మొత్తం కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తుంటే... టీఆర్ఎస్ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆఫ్రికాలో పుట్టిన ఒబామా అమెరికాకు అధ్యక్షుడయ్యాడని, అలా ఎవరైనా ఎక్కడైన ఉండొచ్చని కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలంతా గుర్తించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎలా మాట్లాడినా పెద్దగా పట్టించుకోరని, అధికారంలో ఉంటే అలా కాదని, బాధ్యతగా మాట్లాడాలని బాబు హితవు పలికారు. తెలంగాణలో అధికారపార్టీకి చెందిన నేతలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
సీమాంధ్ర ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు చట్టం ఉందని తెలిపారు. 'వార్ రూం' అంటూ టీఆర్ఎస్ లేనిపోని అభద్రత సృష్టిస్తోందని అన్నారు. కావాలంటే టీఆర్ఎస్ పెట్టిన వార్ రూంకి తాను కూడా వస్తానని చెప్పారు. వార్ రూంలో ఏముంది? అని ప్రశ్నించిన బాబు, విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని హితవు పలికారు. అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సరికాదని ఆయన సూచించారు.
తెలుగు మాట్లాడే ప్రతివాడూ సోదరుడేనని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కలిసి ఉండి అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వార్ రూం పెట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరిన ఆయన, మంచిగా ఉంటున్నాం కదా అని, తప్పుడు ప్రచారం చేసి విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మోడీపై దేశ ప్రజలంతా నమ్మకం పెట్టుకున్నారని, ప్రజాస్వామ్యంలో సాధారణ వ్యక్తి దేశ ప్రధానిగా ఎదగగలడని నిరూపించిన వ్యక్తి మోడీ అని బాబు తెలిపారు. తనకు ఎవరి మీదా వ్యక్తిగత కక్ష లేదని బాబు స్పష్టం చేశారు.