: ముషారఫ్ నామినేషన్ ను తిరస్కరించిన పాక్ ఈసీ
మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నామినేషన్ ను పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. రానున్న సాధారణ ఎన్నికలలో పాక్ లోని కరాచీ, ఇస్లామాబాద్, చిత్రాల్, కసుర ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అందులో కసుర్ నుంచి ముషారఫ్ పోటీచేయడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 62,63 కింద స్థానిక న్యాయవాది జావేద్ కసూరి ఈసీకి చేసిన ఫిర్యాదులో అభ్యంతరాన్ని లేవనెత్తారు. అంతేకాక ముషారఫ్ పలు కేసులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దాంతో న్యాయవాది అభ్యంతరాన్ని అంగీకరించిన రిటర్నింగ్ అధికారి మహ్మద్ సలీమ్ రాజ్యాంగంలోని ఎన్ఏ-138 కింద ముషారఫ్ నామినేషన్ ను తిరస్కరించారు. 'ఆల్ పాకిస్థాన్ ముస్లిమ్ లీగ్' అధ్యక్షుడైన ముషారఫ్ మే 11న జరుగనున్న పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందుకోసం నాలుగు సంవత్సరాల స్వీయ బహిష్కరణ అనంతరం ఆయన దుబాయ్ నుంచి గతనెల 24న స్వదేశానికి తిరిగివచ్చిన సంగతి తెలిసిందే.