: దీపావళికి తులం బంగారం రూ.23 వేలకు దిగొచ్చే అవకాశం
బంగారం కొనుక్కోవాలని ఎన్నాళ్లుగానో ఆశతో ఎదురు చూస్తున్న వారికి మోడీ రాకతో మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ప్రభుత్వం బంగారం దిగుమతి నిబంధనలను సడలించి 20:80 చేయడం బంగారం, ఆభరణాల పరిశ్రమకు ఊతమివ్వనుంది. అంటే దిగుమతి చేసకున్న 100 శాతం బంగారంలో 20 శాతం తిరిగి ఆభరణాల రూపంలో ఎగుమతి చేస్తే చాలు. దీంతో దేశీయంగా బంగారం లభ్యత పెరగనుంది.
ఈ నేపథ్యంలో ఇండియన్ బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అధ్యక్షుడు మోహిత్ ఖాంబోజ్ మాట్లాడారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని చెప్పారు. వచ్చే దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర 23 - 24 వేల స్థాయికి తగ్గుతుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో బంగారంపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
బంగారం ధరలు అంతర్జాతీయంగా కొంచెం చల్లబడ్డా... నిన్నటి వరకు డాలర్ తో రూపాయి మారకం విలువ దిగువ స్థాయుల్లో ఉండడంతో దేశీయంగా బంగారం ధరలు పై స్థాయిలోనే ఉండిపోయాయి. అయితే, కొంత కాలంగా రూపాయి బలం పుంజుకుంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు, దేశీయంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రూపాయి మరింత బలపడనుంది. అదే జరిగితే బంగారం స్వల్ప కాలంలోనే 25వేల స్థాయికి దిగి వచ్చే అవకాశం ఉంటుంది.