: కేసీఆర్ కేబినెట్ ఇదేనా?


తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లోకి తన సహచర వర్గాన్ని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అనుభవానికి పెద్దపీట వేసిన కేసీఆర్ డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలనే దానిపై ఆయన కాస్త సందిగ్థంలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఎక్కువగా వున్న ముస్లిం వర్గాన్ని ఆకట్టుకునేందుకు మైనార్టీ వర్గం నుంచి మహమూద్ అలీకి, ఎన్నికల సందర్భంగా దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీకి కట్టుబడి దళిత వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ను డిప్యూటీ సీఎంలుగా నిర్ణయించనున్నట్టు సమాచారం.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన విద్యుత్, వ్యవసాయరంగం, సాగునీటి పారుదల వంటి కీలక శాఖను హరీష్ రావుకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హైదరాబాద్ ను ఐటీహబ్ గా ప్రకటించి, భారీ ప్రాజెక్టులు కట్టబెడుతున్న సందర్భంలో ఆయా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కేటీఆర్ కు ఐటీ, భారీ పరిశ్రమల శాఖను కట్టబెట్టనున్నారు. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి హోం శాఖను కేసీఆర్ అప్పగించనున్నారు.

తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఈటెల రాజేందర్ కు ఆర్థిక శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఉండగా మంత్రి పదవి నిర్వహించిన అనుభవంతో జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. ఉద్యోగులుగా కార్మికుల కష్టాలు తెలిసిన మాజీ జేఏసీ నేతలు స్వామిగౌడ్ లేదా, శ్రీనివాస్ గౌడ్ కు కార్మిక, ఉపాధి శాఖను కేటాయించనున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి గ్రామీణాభివృద్ధి శాఖ అప్పగించనుండగా, జగదీశ్వర్ రెడ్డికి పంచాయతీ రాజ్ శాఖను కట్టబెట్టనున్నారు.

టీఆర్ఎస్ లో కీలకమైన మహిళా నేతలుగా పేరు ప్రతిష్టలు కలిగిన పద్మాదేవేందర్ రెడ్డి లేదా, కొండా సురేఖల్లో ఒకరికి మహిళా శిశు సంక్షేమశాఖను కేటాయించనున్నారు. రాజయ్య లేదా లక్ష్మారెడ్డికి ఆరోగ్య శాఖను కేటాయించనున్నారు. కాగా, ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన రెవెన్యూ శాఖ, సాంఘీక సంక్షేమ శాఖలను కేసీఆర్ అదనంగా స్వీకరించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News