: సూపర్ క్యాచ్ అంటే ఇదే!
క్రికెట్ పై ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తయినా ఐపీఎల్ 7 లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడు క్రిస్ లిన్ పట్టిన క్యాచ్ అద్భుతం అని ఒప్పుకుంటాడు. మరి ఓ క్యాచ్ నిండు ప్రాణాన్ని కాపాడితే అదే అద్భుతమైన క్యాచ్ అని మనిషన్న ప్రతి వాడూ ఒప్పుకుని తీరతాడు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే సంభవించే అలాంటి ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని గ్వాండ్ డాంగ్ లో వర్షం వచ్చేలా అనిపించడంతో ఓ వ్యక్తి రోడ్డుపై ఓ భవనం ముందు నుంచి ఆదరాబాదరాగా నడుస్తూ వెళ్తుండగా ఆకాశం వైపు చూశాడు. అంతే నిశ్చేష్టుడై నిలుచుండిపోయాడు.
కారణం ఆ భవంతి పై అంతస్తు కిటికీకి ఏడాది వయసున్న చిన్నారి వేలాడుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన, తనలాగే నడుస్తున్న ఓ పాదచారి సాయంతో పట్టు తప్పి పడిపోతున్న ఆ బాలుడిని క్యాచ్ పట్టాడు. ఈ వీడియోని గ్వాంగ్ డాంగ్ టీవీ ప్రసారం చేసింది. ఇది సోషల్ నెట్ వర్క్ లో సందడి చేస్తోంది. బాలుడు ప్రాణాలతో బయటపడడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ, 'సూపర్ క్యాచ్' అంటూ క్యాచ్ పట్టిన వ్యక్తిని హీరోగా అభివర్ణిస్తున్నారు.