: వాషింగ్టన్ వీధుల్లో ఒబామా హల్ చల్!
అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎప్పుడూ భిన్నంగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ లోని వైట్ హౌస్ నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న కార్యాలయానికి వాహనంలో వెళ్లకుండా నడిచి వెళ్లాలని అనుకున్నారు. ఆ వెంటనే అధికారులతో కలసి నడిచి వెళ్లారు. వెళ్లే దారిలో పార్కుల్లో గడుపుతున్న ప్రజలను పలకరించుకుంటూ, కరచాలనం చేస్తూ, వారితో ఫోటోలు దిగుతూ ఆశ్చర్య పరిచారు. అటు సామాన్య జనం కూడా ఒబామాను చూసి షాకయ్యారు.
ఒక్కసారిగా తమ దేశాధ్యక్షుడే కళ్ల ముందుకు వచ్చే సరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొద్దిపాటి దూరంలో ఉన్నవారు కూడా పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ మహిళ అయితే ఆనందం పట్టలేక తాను చూస్తున్నది ఒబామానేనా? అనడంతో... ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఫోటోకు పోజిచ్చారు. అలా అక్కడి వాతావరణాన్ని ఆయన ఆస్వాదించారు. ఈ వీడియోను వైట్ హౌస్ అధికారులు నిన్న(గురువారం) యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దాదాపు లక్షమంది దీనిని తిలకించారు.