: రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న మైదానంలోని ముందు భాగంలో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు తగిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. విదేశీ అధికారులు సహా మొత్తం మూడువేల మంది అతిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలో అదే ప్రాంతంలో ప్రధానిగా వాజ్ పేయి ప్రమాణ స్వీకారం చేయడంతో మోడీ కూడా అక్కడే కార్యక్రమం జరగాలని కోరడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక, భారీగా తరలి వచ్చే సందర్శకుల కోసం ఆ ప్రాంతంలో అనువైన స్థలం కూడా ఉంటుంది. కాగా, అటు ఈ కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు, ఢిల్లీ పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి అమిత పాల్ ఓ సమావేశం నిర్వహించారు.