: 'అమ్మ'పై భారం వేస్తోన్న సంజయ్ దత్
ముంబయి వరుస పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలుశిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆధ్యాత్మిక బాట పట్టాడు. శిక్ష విషయంలో క్షమాభిక్ష కూడా కోరనని చెప్పిన ఈ ఆజానుబాహుడు, ఇప్పుడు భారమంతా అమ్మవారిపై వేస్తున్నాడు. ఈ క్రమంలో సంజయ్ దత్ తన సన్నిహితులతో కలిసి నేడు మధ్య ప్రదేశ్ దాతియా జిల్లాలోని దేవీ పీఠాన్ని సందర్శించాడు.
ఈరోజు ఉదయం ఆయన తన బావ కుమార్ గౌరవ్ తో పాటు మరికొందరు వెంటరాగా విమానంలో ఇక్కడి శివ్ పురి విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం, దేవీ దర్శనం చేసుకుని అక్కడి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కాగా, ఈ పర్యటన గోప్యంగా సాగింది. అయితే, సంజయ్ ను చూసేందుకు అభిమానులు స్థానిక విమానాశ్రయం వద్ద గుమికూడారు. ఈ సాయంత్రం సంజయ్ దత్ ముంబయికి తిరుగు ప్రయాణం అవుతాడని తెలుస్తోంది.