: అలాంటి కొడుకు ఉండకూడదనే చంపేశాం: తల్లిదండ్రులు


పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కొడుకు కానీ...నిత్యం నరకం చూపించేవాడు కొడుకు కాదని... నవమాసాలు కడుపులో, 20 ఏళ్లు భూమిపై మోసిన కొడుకును తగులబెట్టి చంపేశానని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన కోదాటి పద్మావతి (55) పోలీసులకు తెలిపింది. ఆమె పోలీసులకు వాంగ్మూలమిస్తూ... తన కుమారుడు కోదాటి పెద్దిరాజు (36) వ్యసనాలకు బానిసై 20 ఏళ్లుగా తమను పీడిస్తున్నాడని చెప్పింది.

వాడి భవిష్యత్ బాగుండాలనే ఆశతో జీవనోపాధి కోసం ఆరుసార్లు ఆటోలు, ఓ మినీ వ్యాను కొనిచ్చామని ఆమె తెలిపింది. వ్యసనాలకోసం వాటిని అమ్మేశాడని, మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎవరితోనూ జీవితాన్ని పంచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు కష్టపడకూడదని ఉన్న ఇల్లు, ఎకరం పొలం అమ్మేసి ఆ డబ్బు ఇచ్చామని ఆమె తెలిపింది. చివరకు తాము ఉంటున్న ఇంటిని కూడా అమ్మేసి డబ్బివ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని, బిడ్డే కదా అని కనికరిస్తే గతరాత్రి వచ్చి వీరంగం వేశాడని, చంపేస్తానంటూ రాద్దాతం చేశాడని, వాడికి భయపడి తన భర్త, తాను చుట్టుప్రక్కల ఇళ్లలో తల దాచుకున్నామని ఆమె చెప్పింది.

ఉదయం తల్లిదండ్రుల కోసం పెద్దిరాజు ఎదురుచూస్తుండగా, స్థానికులు వచ్చి తల్లిదండ్రులతో ఇలా వ్యవహరించడం సరికాదని మందలిస్తున్న సమయంలో, తాను పెట్రోల్ పోసి నిప్పంటించానని పద్మావతి తెలిపింది. ఆ మంటలు కాస్తా గుడిసెకు అంటుకోవడంతో పెద్దిరాజు అగ్నికి ఆహుతయ్యాడని ఆమె పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News