: మలాలాపై చిత్రంలో హాలీవుడ్ స్టార్లు..?
పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ వీరోచిత గాథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో హాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. 'బ్రేవ్ హార్ట్' హీరో మెల్ గిబ్సన్ తో పాటు 'మాట్రిక్స్' సిరీస్ హీరోయిన్ మోనికా బెలూచి లను ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాగా, ఇంగ్లిష్ భాషలో నిర్మితమయ్యే ఈ చిత్రానికి 'గుల్ మకాయ్' అని పేరు పెట్టారు. 'గుల్ మకాయ్' అంటే.. మొక్క జొన్న పువ్వు అని అర్థం. పాకిస్తాన్ లో బాలికల విద్యా హక్కు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా తన బ్లాగ్ కు పెట్టుకున్న పేరునే ఈ సినిమాకు పెట్టడం విశేషం.ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు అంజాద్ ఖాన్ మాట్లాడుతూ, గిబ్సన్, బెలూచిలను ఒప్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని, మిగతాది దేవుడి దయ అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమా షూటింగ్ భారత్ లో జరపాలని నిర్ణయించుకున్న చిత్ర యూనిట్ 200 రోజుల షెడ్యూల్ ను ఖరారు చేసింది. కాన్పూర్ పరిసర ప్రాంతాలతో పాటు మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ సాగిస్తారు. ఈ చిత్రంలో డానీ డెంజొప్ప, ఓంపురి, నసీరుద్దీన్ షా, సీమా బిశ్వాస్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.