: మహబూబ్ నగర్ జిల్లాలో నేడు స్పీకర్, ఎమ్మెల్యేల పర్యటన
భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు గిరిజనుల జీవితంలో భాగం. ముఖ్యంగా
చెంచు తెగల వారి జీవనం ఎంతో ప్రత్యేకంగా వుంటుంది. వీరు పూర్తిగా అడవులకే పరిమితం. కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. జంతువులు, పక్షులను వేటాడి ఆహారంగా తీసుకుంటారు. వీరు మాట్లాడే భాష చెంచు. ఆ పేరుతోనే వీరిని పిలుస్తారు. వీరు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కర్నూలు తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కనిపిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా నేటికీ వీరి జీవనంలో మార్పు లేదు. బాహ్య సమాజంతో కలవడానికి వీరు ఆసక్తి చూపరు. అనారోగ్యం, పోషకాహారం లోపం వల్ల వీరి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో చెంచు జాతి పరిరక్షణకు ప్రభుత్వం దశాబ్ద కాలంగా పలు కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది. కొండ ప్రాంతాలలో పాఠశాలలు, రక్షిత తాగునీరు, సమీపంలో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టింది.
ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో 16 మంది ఎమ్మెల్యేల బృందం(వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ) ఈ రోజు పర్యటిస్తోంది. జిల్లాలోని మున్ననూరు ప్రాంతంలో చెంచుల కోసం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. చెంచుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, వారి కోసం ఇంకా ఏమైనా కార్యక్రమాలను చేపట్టాలా? అన్న అంశంపై కూడా కమిటీ సభ్యులు ద్రుష్టి సారిస్తారు. వీరి పర్యటన ఈ రోజు, రేపు కొనసాగుతుంది.