: ఫేస్ బుక్ హోమ్ తో వచ్చిన 'హెచ్ టీసీ ఫస్ట్'
మీరు ఫేస్ బుక్ ప్రియులా.. క్షణ క్షణానికి అప్ డేట్స్, పోస్టింగులు, ఫ్రెండ్స్ తో ముచ్చట్లు... మీ హాబీనా? అయితే, ఇది మీ కోసమే! స్మార్ట్ ఫోన్ నుంచే మరింత వేగంగా ఫేస్ బుక్ లో విహారం చేసేందుకు హెచ్ టీసీ ఫస్ట్ మొబైల్ వచ్చేసింది. మరింత మంది వినియోగదారులకు చేరవయ్యేలా ఫేస్ బుక్, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ టీసీతో చేతులు కలిపి ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో ఫేస్ బుక్ హోమ్ అనే కొత్త అప్లికేషన్ ఉంటుంది. దీంతో వెబ్ సైట్ ద్వారా కనెక్ట్ అవ్వాల్సిన పని లేకుండా నేరుగా హోమ్ స్క్రీన్ నుంచే క్షణ క్షణానికి ఫేస్ బుక్ లో విహరించవచ్చు.
4.1 జెల్లీ బీన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఆధారంగా హెచ్ టీసీ ఫస్ట్ పనిచేస్తుంది. దీనిలో 4.3 అంగుళాల స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, డ్యుయల్ కోర్ సిపియు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 12 నుంచీ ఇది లభిస్తుందని ఏటీ అండ్ టీ వెల్లడించింది. దీని ధరను అమెరికాలో సుమారు వంద డాలర్లుగా నిర్ణయించారు.
ఫేస్ బుక్ హోమ్ అప్లికేషన్ ను ఏప్రిల్ 12 నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హెచ్ టీసీ ఫస్ట్, ఒన్, ఒన్ ఎక్స్ ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్2 పరికరాలలో ప్రస్తుతం ఫేస్ బుక్ హోమ్ ను వినియోగించుకోవచ్చు. మిగతా ఆండ్రాయిడ్ డివైజెస్ కు కూడా ఫేస్ బుక్ హోమ్ అప్లికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది.