: నీటి ఒప్పందం ఫైలును మోడీ బయటకు 'తీస్తా'రా?


దేశ ప్రధానమంత్రిగా కొద్ది రోజుల్లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏళ్ల తరబడి మూలపడ్డ 'తీస్తా నీటి ఒప్పందం' తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందంపై మోడీ సంతకం చేస్తారా? లేదా? అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తీస్తా ఒప్పందంపై సంతకం చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలా ఆ ఒప్పందం అపరిష్కృతంగా మిగిలిపోయింది.

'తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా అధినేతలను ఆహ్వానించేందుకు మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖతో టచ్ లోనే ఉన్నారు. ఇదే సమయంలో తీస్తా నీటి ఒప్పందంపై తక్కువ సమయంలో ఎలా పరిష్కరించాలనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు' అని ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు. ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు చెప్పిన సమయంలోనే ఈ అంశంపై పరిష్కారం చూపాలంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా లేవనెత్తారు. వెంటనే స్పందించిన మోడీ తప్పకుండా ఒప్పందంపై దృష్టిపెట్టి అర్థవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారని సదరు బీజేపీ నేత వివరించారు.

  • Loading...

More Telugu News