: రాజ్యసభ రూట్ లో నితీశ్?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగు పెట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో జేడీ(యూ) ఘోర పరాజయం పాలవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ మిగతా ఎంపీల నిర్ణయం మేరకు రాజ్యసభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి, నితీశ్, మాధేపుర లోక్ సభ స్థానం నుంచి ఓడిపోయిన జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ రాజ్యసభ రేసులో నిలవాలనుకున్నట్లు వినికిడి. అసెంబ్లీలో ఉన్న 117 అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ ఇద్దరిని తప్పకుండా రాజ్యసభకు పంపించగలదు. ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. దాంతో, ఆ ఎంపీల పార్టీలతో చర్చించి తమకు సహకరించాలని నితీశ్ కోరనున్నట్లు జేడీయూ నుంచి సమాచారం.