: 11 నెలల పాప పారాచ్యూట్ తో ఎగిరిపోయింది!
11 నెలల పసి పాప. అడుగులు కూడా సరిగా పడని వయసు. లోకం గురించి తెలియని అమాయకత్వం. కానీ, ఆ చిన్న దానిని ఓ ప్రైవేటు కంపెనీ వారు ఏం చేశారో తెలుసా... రికార్డు కోసం పారాచ్యూట్ లో కూర్చోబెట్టి ఆకాశంలోకి విడిచిపెట్టారు. ఇదెక్కడో కాదు కేరళలోని కన్నూరులోని ముజిపిల్లంగాడి బీచ్ వద్ద ఈ రోజు జరిగింది. పసిపాప నియానిజంతో పారాచ్యూట్ 40 అడుగుల ఎత్తుకు వెళ్లి తర్వాత కిందికి దిగొచ్చింది. అంత సేపూ ఆ పసిపాప భయంతో ఏడుస్తూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నూరు జిల్లా ఎస్పీ పీఎన్ ఉన్నిరాజా మాట్లాడుతూ... తాను ఇలాంటి పని చేయవద్దని తల్లిదండ్రులకు ముందే చెప్పినట్లు వెల్లడించారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు నమోదు చేసే విషయం పరిశీలిస్తామని చెప్పారు. నిర్వాహకులు మాత్రం ఇలాంటివి నిషేధమని చట్టంలో ఎక్కడా చెప్పలేదంటున్నారు. అంత చిన్న పాపను ఆకాశంలోకి పంపడాన్ని వీరెలా సమర్థించుకుంటారో కోర్టులే తేల్చాల్సి ఉంది.