: మోడీపై సునీతా విలియమ్స్ గుర్రు
విఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ తన గుజరాత్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. మోడీతో సునీతా భేటీకి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ఏ మాత్రం స్పందించలేదని సమాచారం. పైగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాన్ని వినియోగించుకునేందుకు సునీతా విలియమ్స్ తిరస్కరించారు.
సునీతా మొదటి రోజంతా తన కజిన్, గుజరాత్ దివంగత హోం మంత్రి హరేన్ పాండ్యా సతీమణి జాగృతి పాండ్యా వద్ద గడిపారు. సునీతా, నరేంద్ర మోడీతో సమావేశం కాకపోవడానికి కారణం మోడీ పట్ల వారి కుటుంబ సభ్యులలో ఉన్న వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది. హరేన్ పాండ్యా హత్యలో రాజకీయ కుట్ర దాగుందని వారు అనుమానిస్తున్నారు. ఆ కోపమే మోడీకి సునీతా దూరంగా ఉండడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.